తెలంగాణపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరితో విసిగిపోయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నారట. చంద్రబాబుకు షాక్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును చావు దెబ్బ తీసేందుకు ఆయన కొత్త ఎత్తుగడలు పన్నుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ టిడిపిని ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు వినికిడి. ఈ విషయంపై ఆయన ఇది వరకే పార్టీ నాయకులు టి.దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరిలతో మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెడ్డి, బిసి, దళిత కాంబినేషన్ లో దాన్ని ఏర్పాటు చేస్తే కెసిఆర్ కు దీటుగా ఉంటుందని ఆయన వారిద్దరికి పూసగుచ్చినట్లు చెప్పారట. కెసిఆర్ వ్యవహార శైలిపై చాలా మంది విసిగిపోయి ఉన్నారు. ఈ స్థితిలో తాము తెలంగాణకు సంబంధించి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే ఇతోధిక మద్దతు లభిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు తెలంగాణ వైఖరిపై, తమ పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. పైగా, తమను పక్కన పెట్టి తెలంగాణలో చంద్రబాబు ఎర్రబెల్లి దయాకర్ రావును ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తి కూడా ఆయన వెన్నాడుతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, ఇదంతా ఇప్పటి వరకు గాలివార్తల స్థాయిలోనే ఉన్నా నిజం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.