కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ 38 ఏళ్ల కూతురు ప్రియాంక గాంధీ కొత్త అవతారంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందిరా గాంధీ మళ్లీ దిగి వచ్చిందా అనిపించే విధంగా ఆమె కట్టు, తలకట్టు ఉన్నాయి. తన తండ్రి రాజీవ్ గాంధీకి శుక్రవారం నివాళులు అర్పించడానికి ఆమె వచ్చింది. ఈ సందర్భంగా ఆకుపచ్చ కాటన్ చీర ధరించి, రింగులు తిరిగిన జుట్టుతో అచ్చం ఆమె తన నాయనమ్మ ఇందిరా గాంధీని తలపించింది. నిజానికి, ప్రియాంక గాంధీది రింగుల జట్టు కాదు. ఇందిరా గాంధీ జుట్టుకు ఆమె జుట్టుకు చాలా తేడా ఉంటుంది. అయితే, ఇందిరకు మాదిరిగానే ప్రియాంకది పొడుగు ముక్కు. దాంతో హెయిర్ డిజైనర్ కాస్తా జాగ్రత్తలు తీసుకుని ప్రియాంక హెయిర్ స్టైల్ ను మార్చారు. కాటన్ చీరలో, రింగుల జట్టుతో ఆమె నాయనమ్మ పోలికతో కనిపించింది. ఇదేమైనా, ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశానికి ముందు రిహార్సలా అనేది చెప్పలేం. ఇప్పటికే, సోదరుడు రాహుల్ గాంధీ నిండా రాజకీయాల్లో మునిగి ఉన్నారు. ఆమె కూడా వస్తే మళ్లీ కాంగ్రెసుకు పాత కళ వస్తుందని అంటున్నారు.