దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రాబల్యం తగ్గినట్లే కనిపిస్తోంది. వైయస్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా వ్యవహరించడమే ఇప్పుడు ఆయన మైనస్ గా మారిందని అంటున్నారు. వైయస్సార్ మనుషుల పట్ల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అంత ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. వైయస్ హయాంలో సోనియా గాంధీ ప్రసంగాలను ఆంధ్రప్రదేశ్ లో వేదిక మీది నుంచి తెలుగులోకి అనువదించి అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉండవల్లి పేరు సంపాదించుకున్నారు. ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావుపై యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు ఆయన తెర మరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. వైయస్ అండదండలతోనే ఉండవల్లి ఇంతకు ముందు ఎఐసిసిలో స్థానం దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన ఎఐసిసిలో తన స్థానాన్ని కోల్పోతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోవడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీ రావుపై యుద్ధానికి స్వస్తి చెప్పినట్లు వినికిడి.