హత్యకు గురైన పరిటాల రవి ముఖ్య అనుచరుడు పోతుల సురేష్ తో ప్రత్యర్థి మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి సయోధ్యకు ప్రయత్నించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పరిటాల రవి హత్య కేసులో సూరి నిందితుడు. పరిటాల రవి ముఖ్య అనుచరులు పోతుల సురేష్, చమన్, షావలీ కలిసి రవిని హత్య చేసినవారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ మిషన్ ను ఏర్పాటు చేసినట్లు వినికిడి. దానివల్ల ఆ ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించిన సూరి వారితో సయోధ్యకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. సూరత్ లో తలదాచుకుంటున్న పోతుల సురేష్ ను అనంతపురం జిల్లా ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఈ కథనం ప్రచారంలోకి వచ్చింది. చాలా కాలంగా పోలీసులు పోతుల సురేష్ కోసమే కాకుండా చమన్ కోసం కూడా గాలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిటాల రవి హత్య తర్వాత వారు అజ్ఞాతంలోకి వెళ్లారు. పోతుల సురేష్ అరెస్టయిన నేపథ్యంలో అనంతపురం రక్తచరిత్ర ఏ మలుపు తిరుగుతుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.