తన రక్త చరిత్ర సినిమాలో గుండు గీయించిన సీన్ ఉందని, అయితే అది సినిమా యాక్టర్ ది కాదని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. రక్త చరిత్ర సినిమాపై ఆయన ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో మాట్లాడారు. ఓ ప్రముఖ సినీ నటుడికి భూవివాదంలో హత్యకు గురైన పరిటాల రవి గుండు గీయించినట్లు అప్పట్లో వార్త వచ్చింది. దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పత్రికపై ఆందోళనకు కూడా దిగారు. తన రక్త చరిత్ర సినిమాలో ఆ సీన్ ఉందని, అయితే అది యాక్టర్ ది కాదని వర్మ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాను విడుదల చేసి తీరుతానని, తాను ఎవరికీ భయపడనని ఆయన అన్నారు. అవసరమైతే సినిమాను వ్యతిరేకిస్తున్నవారికి దయ్యాలు పట్టిస్తానని ఆయన అన్నారు. ఎవరినీ తన సినిమాలో చెడుగా చూపలేదని, ఎవరైనా సినిమా చూసిన తర్వాత మాట్లాడాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ చివరలో సినిమాను విడుదల చేస్తానని ఆయన అన్నారు. సినీ నటి శ్రీదేవిపై తన ఎనలేని అభిమానాన్ని ప్రకటించారు. నాగార్జునతో సినిమా తీస్తానని కూడా చెప్పారు. శ్రీదేవిని పెళ్లాడిన బోనీ కపూర్ అదృష్టవంతుడని ఆయన అన్నారు.