తెలంగాణ రాములమ్మ రాణి రుద్రమదేవిగా కనిపించనుందట. తెలుగు తెరకు చాలా కాలం దూరమైన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి రాణి రుద్రమదేవి సినిమాలో నటించేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి కథ తెలంగాణ ఉద్యమానికి ఊపునివ్వడమే కాకుండా తనకు మంచి పేరును సంపాదించి పెడుతుందని విజయశాంతి నమ్ముతున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాకు ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తారని, అందుకు రెహ్మాన్ తో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు వినికిడి. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సినిమాకు సమాంతరంగా, ఓ రకంగా పోటీగా ఈ సినిమాను రూపుదిద్దుతున్నట్లు సమాచారం. చిరంజీవి 150వ చిత్రంతో పాటే దీన్ని విడుదల చేసేలా విజయశాంతి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.