ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి మర్యాదకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పడిపోయారు. ఇటీవల వివేక్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారట. ఈ విషయాన్ని వివేక్ స్వయంగా చెప్పారు. తనతో బ్యూటిఫుల్ గా చాట్ చేశారని చెప్పారు. చిరంజీవి జెమ్, మర్యాదస్థుడు, ప్రేమపూరితుడని కొనియాడారు. తనను చిరంజీవి దీవించారని, స్ఫూర్తినందించారని, తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ నని చెప్పుకున్నారు. ఇదంతా వివేక్ రక్తచరిత్రలో పరిటాల రవి పాత్రను పోషించిన తర్వాత తన ట్విట్టర్ లో రాసుకున్నాడు. పరిటాల రవి పాత్రకు వివేక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో వివేక్ తెలుగు పదాలను వాడడం పెంచాడు. తన ట్విట్టర్ లో ఎక్కువగా తెలుగు పదాలు వాడి తెలుగు ప్రజల మనస్సులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా థ్యాంక్స్ గురూ లాంటి వాక్యాలను వాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు నా మనసుని కదిలించివేశాయి, మీరు చూపించిన ఈ అభిమానం, ఆదరణలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు, ఐ లవ్ యూ ఆల్ అంటూ వివేక్ ఒబెరాయ్ తన మనసులో మాటలను తెలుగులో పేర్చారు. రక్త చరిత్ర సినిమాలో పోషించిన పరిటాల రవి పాత్రకు వివేక్ ఒబెరాయ్ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.