తాను నటించబోయే సినిమా జనరంజకంగా ఉంటుందని చెబుతున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దర్శకుడెవరనేది చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారనేది కాదనలేని విషయం. అయితే, ఆ దర్శకుడు చిరంజీవికి నచ్చాలి. రోబో ఆడియో ఆవిష్కరణ సభలో శంకర్ అవకాశమిస్తే సినిమా చేయాలని ఉందని చిరు తన అభిమతాన్ని వ్యక్తం చేశారు. అయితే, శంకర్ అందుకు సిద్దంగా ఉన్నారా అనేది సందేహమే. దీంతో చిరంజీవి నటించే సినిమాకు దర్శకుడి వేట ప్రారంభమైనట్లు చెబుతున్నారు. చిరు బావ మరిది అల్లు అరవింద్ ఆ పనిలోనే ఉన్నారట. అయితే, చిరు మనసులో ఇద్దరు దర్సకులున్నారని అంటున్నారు. వారిలో ఒకరు - రాజమౌళి కాగా, రెండో దర్శకుడు - వి.వి. వినాయక్. ఈ ఇద్దరితో అల్లు అరవింద్ చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. వీరిలో ఎవరిని చిరంజీవి 150వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం లభిస్తుందో వేచి చూడాల్సిందే. కథ కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఆ కథను బట్టి కూడా దర్శకుడి ఎంపిక జరగవచ్చునని అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన బాధ్యత పెరిగిందని భావిస్తున్న చిరు కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అది తన 150వ చిత్రం కావడం వల్ల కూడా మరింత జాగ్రత్తగా ఉంటారని చెబుతున్నారు.