స్వయానా మేనమామ. మేనమామ కుమారుడి పెళ్లి. ఆ పెళ్లికి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ డుమ్మా కొట్టారు. కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడి పెళ్లికి వైయస్ జగన్ హాజరు కాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడితో ప్రజారాజ్యం పార్టీ నేత భూమా నాగిరెడ్డి కూతురికి గురువారం హైదరాబాదులోని వివాహం జరిగింది. శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులు ప్రజారాజ్యంలో ఉన్నా వైయస్ జగన్ ను బలపరుస్తున్నారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న పెళ్లికి జగన్ రాకపోవడం ఎంతైనా ఆశ్చర్యకరమే. ఈ పెళ్లికి చిరంజీవి, జయప్రకాష్ నారాయణ, రామానాయుడు, కెవిపి రామచందర్ రావు వంటి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వైయస్ జగన్ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. జగన్ తల్లి వైయస్ విజయమ్మ దగ్గరుండి పెళ్లి జరిపించారు. జగన్ బావ అనిల్ కుమార్ కూడా వచ్చారు. జగన్ గైర్హాజరును రవీంద్రనాథ్ రెడ్డి మరో రకంగా సమర్థించుకున్నారు. అనారోగ్యం కారణంగా జగన్ రాలేకపోయారని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఏమైనా, వైయస్ జగన్ చర్యలు విచిత్రంగానే ఉంటాయని అందరూ అనుకుంటున్నారు.