కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావుపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు ఎంత కడుపు మంటో చెప్పలేం. కేశవరావు అధిష్టానానికి దగ్గరై వైయస్ జగన్ పప్పులు ఉడకకుండా చేసిన నాయకుల్లో కేశవరావు కూడా ఒక్కరనే విషయం అందరికీ తెలిసిందే. సందు దొరికితే కేశవరావును ఉతికి ఆరేయడానికి వైయస్ జగన్ కు చెందిన సాక్షి మీడియా ఏ మాత్రం వెనకాడడం లేదు. తాజాగా, పశ్చిమ బెంగాల్ రాజకీయాల విశ్లేషణలో కేశవరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశవరావును కలుపు మొక్కగా అభివర్ణించింది. వైద్యానికి పెరటి మొక్కనే పనికి రాదు, కలుపు మొక్క ఎలా పనికి వస్తుందని కాంగ్రెసు పశ్చిమ బెంగాల్ కాంగ్రెసు ఇంచార్జీగా వ్యవహరిస్తున్న కేశవరావుపై వ్యాఖ్యానించింది. అంగ్రేజీ బాగా వచ్చు కాబట్టి కేశవరావు బాగా వెలగబెడతాడని భావించి కేశవరావుకు ఆ బాధ్యతలు అప్పగించారట. పోటీ చేస్తే పట్టుమని పది ఓట్లు కూడా కేశవరావుకు రాలవని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం నుంచి తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ ఇచ్చిన అల్టిమేటాన్ని అవకాశంగా చేసుకుని కేశవరావుపై సాక్షి టీవీ చానెల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించే నేతలపై వైయస్ జగన్ వర్గం, మీడియా అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. అందులో భాగంగానే కేశవరాపుపై అలా విరుచుకుపడి సాక్షి మీడియా ఏదో మేరకు జగన్ కడుపు మంటను చల్లారుస్తూ ఉంటుందనే మాట వినిపిస్తోంది.