పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు అధిష్టానం ఎర వేసింది. తమను ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టిన వైయస్ జగన్ ను ప్రధాని 15 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీలో సభ్యుడిగా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ జాబితాను విడుదల చేసింది. జగన్ ను అందులో చేర్చడం ఎర వేయడమేనని అంటున్నారు. వైయస్ జగన్ తో పాటు చింతా మోహన్, ఎంఎ ఖాన్, సల్లావుద్దీన్ ఓవైసీ, మస్తాన్ వలీ ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీలో జగన్ ను వేయడం విచిత్రమైన విషయమే. జగన్ ను ట్రాప్ చేయడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వేసిన ఎత్తుగడ అని భావిస్తున్నారు. దీన్ని జగన్ ఆహ్వానిస్తారా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. వివిధ రంగాల్లో మైనారిటీల సంక్షేమానికి, ప్రగతికి 15 సూత్రాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే, ముఖ్యమంత్రి పదవి తప్ప మరేదీ తనకు అక్కరలేదనే పద్ధతిలో వ్యవహరిస్తున్న జగన్ ఆ కమిటీ సభ్యుడి హోదా చాలా చిన్న విషయంగానే చూస్తారని అంటున్నారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే కూడా ఆయన నిరాకరించి వచ్చారని, అదో పెద్ద విషయం కాదని, అధిష్టానం ఉచ్చులో పడే ప్రసక్తి లేదని అంటున్నారు.