మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌కు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌తో సంబంధాలున్నాయని నిర్ధారించడానికి ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ మేరకు తాజాగా ఎబిన్ ఆంధ్రజ్యోతి ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఇంతకు ముందు భాను కిరణ్‌తో కలిసి వైయస్సార్ తోడల్లుడు భూదందాలు చేసిన వ్యవహారాన్ని బయట పెట్టిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తాజాగా మస్తాన్ రావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకుంటూ రాసి పెట్టన లేఖను ఆసరా చేసుకుని భానుతో జగన్ సంబంధాలను బయటపెట్టడానికి ప్రయత్నించింది. తాము వైయస్ జగన్ మనుషులమని చెప్పి మంగలి కృష్ణ, భాను కిరణ్ బెదిరించినట్లు, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మస్తాన్ రావు తన సూసైడ్ నోట్‌లో రాశాడు. అప్పట్లో భాను, మంగలి కృష్ణ పేర్లను వెల్లడించిన పోలీసులు వైయస్ జగన్ పేరు చెప్పలేదని నిందించింది. మంగలి కృష్ణ వైయస్సార్ కుటుంబానికి నమ్మినబంటు అని, సూరి వైయస్సార్ మనిషి, అందువల్ల వైయస్ జగన్‌కు భాను కిరణ్‌కు మధ్య సంబంధాలున్నాయని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానించింది. సూరి హత్య వెనక జగన్ పాత్రపై కూడా ఇది వరకు ఆ చానెల్ అనుమానాలు వ్యక్తం చేసింది.