ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీల కన్నా ఆనందంగా ఉన్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇవ్వలేదనే సమాచారం అందడం ఆయన ఆనందానికి ప్రధాన కారణం. తన సమైక్యాంధ్ర నినాదం గెలిచిందని ఆయన సంబరపడి పోతున్నారట. అందరి కన్నా ముందుగా తాను సమైక్యాంధ్ర ఎజెండాను తీసుకోవడం ఫలితం ఇచ్చిందని ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీకి మరింత దగ్గరవుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో తెలంగాణపై సాగదీత ధోరణికి కాంగ్రెసుకు సహకరించేందుకు ఆయన అన్ని విధాలా కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. నివేదిక అధ్యయనానికి సమయం కేటాయించాలని చిరంజీవి కోరడం వెనక కూడా కాంగ్రెసు అధిష్టానం పాత్ర ఉందని భావిస్తున్నారు. అటో కాలు, ఇటో కాలు పెట్టి ప్రయాణం చేయడం వల్ల చంద్రబాబు ఎదుర్కుంటున్న అయోమయం ఆయనకు లేదు. క్యాడర్ పోతుందన భయమూ లేదు. అన్ని విధాలా ఆదుకోవడానికి కాంగ్రెసు చేయూత ఉంది. ఏమైనా, సమైక్యాంధ్ర హీరోగా తానే నిలుస్తాననే దీమా చిరంజీవికి తన సినిమా వంద రోజులు ఆడినంత సంబరంగా ఉందట.