కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీతో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పోల్చుకుంటున్నారా? నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆయన గారి మాటలు చూస్తుంటే - మాటలు ఎంతగా కోటలు దాటుతాయో అర్థమవుతుంది. యువ పార్లమెంటు సభ్యుల్లో చిన్నవాడైనా వైయస్ జగన్‌కే ప్రధాని లక్షణాలున్నాయని ఆయనగారు కితాబు ఇచ్చేశారు. శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో ఆయన ఆ మాటన్నారు.
జగన్ పార్టీని స్థాపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తున్నారని ఆయన మాటలకు మంత్రం పూసి చెబుతున్నారు. అతి చిన్న వయసులో సోనియాపై తిరుగుబాటు చేసి జగన్ తన సత్తాను చాటుకున్నాడని చంద్రశేఖర రెడ్డి అన్నారు. ఇటువంటి మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు గానీ చెప్పే మాటల్లో కొంత మేరకైనా వాస్తవికత కనిపించాలి.