ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జాతకం చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు భయం పట్టుకుందట. హామీల మీద హామీలు ఇచ్చి, ప్రశంసల మీద ప్రశంసలు కురిపించి ప్రజారాజ్యం పార్టీని సాంకేతికంగా తమ పార్టీల విలీనం చేసుకున్న తర్వాత కాంగ్రెసు పెద్దలు చిరంజీవిని మరిచిపోయినట్లే కనిపిస్తున్నారు. పదవులపై చిరంజీవి ఆశలు వదులుకోవాల్సే వచ్చింది. ఎన్నికల వరకు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉండదని ప్రధాని మన్మోహన్ సింగ్ చేతులెత్తేయడంతో చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి అందని ద్రాక్షే అయింది.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెసులో తమ పార్టీని విలీనం చేస్తే చిరంజీవి కన్నా దారుణంగా తన పరిస్థితి ఉండవచ్చునని కెసిఆర్ భయపడుతున్నారట. అందుకే కాంగ్రెసులో పార్టీని విలీనం చేయకూడదని, పార్టీని ఉంచుకుని అవసరమైతే మద్దతు ప్రకటిస్తూ కావాల్సింది పొందడమే మంచిదని ఆయన అనుకుంటున్నారట. మమతా బెనర్జీ బాటలో నడవాలి గానీ చిరంజీవి దారి సరి కాదని ఆయన అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.