అన్నయ్య చిరంజీవి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్యాగానికి సిద్ధపడ్డాడట. తన 150వ చిత్రం కోసం దర్శకుల కోసం వెతుకుతున్న చిరంజీవి చివరికి ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చిరంజీవి 150వ చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు దర్శకుడే ఆయనకు ఆయువుపట్టుగా కనిపిస్తున్నారు. దీంతో పలువురు దర్శకుల గురించి ఆలోచన చేశారు. చివరికి వివి వినాయక్ ను ఎంపిక చేసుకోవడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. తన అల్లుడు అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్ సినిమా దృశ్యాలను కొన్నింటిని చిరంజీవి చూసి థ్రిల్లయ్యారని తెలుస్తోంది. దీంతో వివి వినాయక్ ను తన సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే వివి వినాయక్ ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడానికి ఓ అంగీకారానికి వచ్చారు. అయితే, అన్నయ్య చిరంజీవి వినాయక్ పట్ల ఆసక్తి చూపుతుండడంతో తన సినిమాకు మరో దర్శకుడిని చూసుకోవడానికి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. అన్నయ్య కోసం ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా అని పవన్ కళ్యాణ్ అనుకుని ఆ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.