కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మీద చేసిన వ్యాఖ్యలపై పార్టీ సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా) పేరుకు మాత్రమే వెనక్కి తగ్గారని అంటున్నారు. కుమారులు వివేక్, వినోద్ బతిలాడడంతో కాస్తా వెనక్కి తగ్గినట్లు ఓ ప్రకటన పారేసి ఊరుకున్నారట. కాకా వెనక తెలంగాణ ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఇస్తే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని చెప్పడం వెనక కూడా ఆ వ్యూహమే పని చేసిందని అంటున్నారు. కాకా వ్యాఖ్యలను తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఎవరు కూడా ఖండించకపోవడాన్ని దానికి ముడి పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తమ మార్గం తాము చూసుకోవాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, నాయకులు కొంత మంది కాకాను ముందు పెడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోపడానికి వారు ప్రయత్నిస్తున్నారట. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడని వారంతా తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ముందుకు దూకాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో చిన్న సన్నివేశమే కాకా సోనియాపై ఫైర్ కావడం అంటున్నారు.