గాలి దెబ్బ: జైలు సూపరింటిండెంట్ బదిలీ

ములాఖత్‌ల విషయంలో ఖైదీలందరినీ సమానంగా చూడాల్సిన కేశవనాయుడు విఐపి ఖైదీలతో మిలాఖత్ అయినట్లు తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు కేశవనాయుడు బేఖాతరు చేస్తూ వచ్చారు. చివరికి మీడియాలో వార్తలొచ్చినా ఎదురుదాడికి దిగడమే తప్ప సరిచేసుకొన్న దాఖలాలు లేవు. గాలి జనార్దనరెడ్డి లాంటి వారి ములాఖత్‌ల విషయంలో ఆయన జైలు నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టారనే విమర్శలున్నాయి.
గత సెప్టెంబర్ 5న గాలిని సీబీఐ అధికారులు బళ్లారిలో అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాలికి సహకరించినందుకు ప్రతిఫలంగా జైలు అధికారులకు భారీ ఎత్తున నజరానాలు అందినట్టు ఆరోపణలున్నాయి. జైలు కార్యాలయం నుంచే గాలి తన పనులు చక్కబెట్టుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. జైలు వేదికగానే గాలి బెయిల్ స్కాం జరిగినట్లు ఏసీబీ విచారణలో సైతం వెల్లడైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిఘా విభాగం నుంచి ఈ విషయమై నివేదికలు తెప్పించుకుంది.
గాలి జనార్దనరెడ్డి, జగన్ ములాఖత్‌ల విషయంలో జైలు అధికారులు ఏ విధంగా ఉన్నారు, ఇతర ఖైదీలను కలిసేందుకు ఎంతమంది వస్తున్నారనే విషయాలన్నింటిపై ని ఘా విభాగం సమగ్ర నివేదిక అందజేసింది. నివేదిక ఆధారంగా కేశవనాయుడును సికా ప్రిన్సిపాల్‌గా బదిలీ చేసింది.
ఆ స్థానంలో ఉన్న కె.ఉమాపతిరావును వరంగల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. అక్కడున్న బి.సైదయ్యను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌గా నియమిస్తూ జీవో విడుదల చేశారు. వాస్తవానికి కేశవనాయుడు బదిలీ ఉత్తర్వులు 15 రోజుల క్రితమే సిద్ధమైనట్టు తెలిసింది. అయితే రాజకీయ ఒత్తిళ్ల వల్ల హోంశాఖ వాటిని పెండింగ్‌లో పెట్టినట్టు విమర్శలొచ్చాయి.












Click it and Unblock the Notifications