బాబు తెలంగాణ వ్యూహానికి హరికృష్ణ కొలికి?

చంద్రబాబుతో ఆయన రాజీకి వచ్చి, సర్దుకుపోయేందుకు హరికృష్ణ సిద్ధపడ్డారా అనే అనుమానాలు చాలా మందికే కలిగి ఉంటాయి. మహాత్ములు ఊరక రారు అన్నట్లు హరికృష్ణ కూడా ఆషామాషీగా రాలేదట. తెలంగాణపై చంద్రబాబు వ్యూహానికి అడ్డు తగలడానికే వచ్చినట్లు గిట్టనివారు చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణపై చంద్రబాబు ప్రయత్నాల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారుగా అని హరికృష్ణ దాటవేశారు.
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణపై చంద్రబాబు ప్రకటన చేయకపోవడంపై తెలంగాణ తెలుగు తమ్ముళ్లు అలక వహించగా, హరికృష్ణ మాత్రం తాపీగా ఎలా చేస్తారో చూద్దామన్నట్లు మాట్లాడారని గుసగుసలు పోతున్నారు. సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లకు అండగా నిలచేందుకే ఆయన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినట్లు భావిస్తున్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గతంలో హరికృష్ణ గట్టి ప్రకటనే చేశారు. తన తండ్రి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించారని, రాష్ట్ర విభజన అందుకు విరుద్ధమని హరికృష్ణ వాదించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. సోదరుడు బాలకృష్ణ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన నేపథ్యంలో తెలుగుజాతి ఐక్యతను కాపాడే బాధ్యతను హరికృష్ణ భుజాన వేసుకున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏమైనా, మనసులో ఏముందో ఎవరు మాత్రం చెప్పగలరు.












Click it and Unblock the Notifications