బొత్సకు రాహుల్ తెచ్చి పెట్టిన చిక్కులు

ఢిల్లీ వెళ్లిన బొత్సకు ఆ చేదు రుచి తెలిసి వచ్చిందట. పిసిసి అధ్యక్షుడిగా బొత్స స్థానంలో మరొకరిని నియమించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. పిసిసి పదవి నుంచి తప్పుకోవాలని నేరుగా చెప్పకుండా, ఏ పదవిలో కొనసాగుతారో నిర్ణయించుకోవాలని బొత్సకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ చెప్పినట్టు తెలుస్తోంది.
బొత్సకు ఇప్పటికే పిసిసి పదవిపై వెగటు పుట్టినట్లు చెబుతున్నారు. పిసిసి పదవి చేపట్టిన కొత్తలో బొత్సలో కనిపించిన ఉత్సాహం ఇటీవల కాలంలో కనిపించడం లేదని, పిసిసి అధ్యక్షునిగా కన్నా మంత్రిగా కొనసాగడమే మంచిదన్న అభిప్రాయాన్ని తన సన్నిహితుల వద్ద బొత్స వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలోను, కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిష్కరణ విషయంలోను బొత్స చేసిన ప్రకటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వీటిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి.
పిసిసి పదవి నుంచి తనను తప్పించడం ఖాయమన్న విషయం బొత్సకు ఐదారు నెలల కిందటే తెలిసిందని అంటున్నారు. పిసిసి పదవిని వదలుకునేందుకు బొత్స మానసికంగా ఎప్పుడో సిద్ధమైనట్లు చెబుతున్నారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి బొత్స వైదొలగితే ఆయన స్థానంలో ఎవరు వస్తారన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈసారి పిసిసి పదవిని తెలంగాణ వారికి ఇస్తారా? లేక మళ్ళీ సీమాంధ్రకే కట్టబెడతారా? అన్నది కచ్చితంగా తెలియడం లేదు.












Click it and Unblock the Notifications