అనుభవం: టిపై బాబు మౌనం, హుకుం(పిక్చర్స్)
హైదరాబాద్: విభజనపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇటీవలి పరిణామాలను గమనిస్తే కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. విభజన నిందను విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ టిడిపి పైనే వేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు బయటకు రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే ఆయన గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉండవచ్చునని అంటున్నారు. 2009 డిసెంబర్ 9న రాత్రి కేంద్రం నుండి తెలంగాణపై ప్రకటన వచ్చింది. ఆ మరుసటి రోజు చంద్రబాబు విలేకరుల సమావేశంలో... అర్ధరాత్రి ప్రకటనలు ఏమిటని ప్రశ్నించారు. ఆ తర్వాత సీమాంధ్ర నేతలు వరుసగా రాజీనామాలు చేశారు. డిసెంబర్ 23వ తేదిన కేంద్రం తెలంగాణపై మరో ప్రకటన చేసింది.
నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు పలువురు తెలంగాణవాదులు చంద్రబాబును విమర్శిస్తున్నారు. బాబు కారణంగానే వచ్చిన తెలంగాణ ఆగిపోయిందని మండిపడ్డారు. దీనిని ప్రధానంగా టిఆర్ఎస్ నిత్యం బాణంలా సంధిస్తోంది. బాబు ప్రకటనతో అడ్డుకున్నారనే ఆరోపణలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఇటీవల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది.

తెలంగాణపై నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 9, 2009న ఓ ప్రకటన చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు కూడా డిసెంబర్ 9. దీంతో తెలంగాణవాదులు సోనియా తన పుట్టిన రోజు కానుకగా రాష్ట్రాన్ని ఇచ్చారని ప్రశంసలు గుప్పించారు. అయితే సీమాంధ్ర నేతలు రాజీనామా కారణంగా డిసెంబర్ 23న మరో ప్రకటన చేశారు.

తెలంగాణపై కేంద్రం నుండి ప్రకటన వచ్చిన మరుసటి రోజు చంద్రబాబు డిసెంబర్ 10న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. అర్ధరాత్రి ప్రకటనలు ఏమిటని ప్రశ్నించారు. అయితే అంతకుముందు టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఉంటామని తీర్మానించింది. బాబు వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడ్డారు. బాబు యూ టర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణపై కేంద్రం నుండి ప్రకటన వచ్చిన మరుసటి రోజు నుండి పార్టీలకతీతంగా సీమాంధ్ర నేతలు వరుసగా రాజీనామాలు చేశారు.

డిసెంబర్ 23 ప్రకటన తర్వాత తెలంగాణలో తీవ్ర ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ కోసం టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, టిటిడిపి, టికాంగ్రెసు తదితర పార్టీలతో పాటు పలు సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఆ తర్వాత సకల జనుల సమ్మె ఉద్యమ తీవ్రతను తెలియజేసింది.

తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు సీమాంధ్రలోను సమైక్యాంధ్ర ఉద్యమాలు సాగుతున్నాయి.

ఇరు వైపుల ఉద్యమాలు కొనసాగుతుండటం, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో 2014 ఎన్నికల నాటికి ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను మరోసారి వేడెక్కించాయి.
గత అనుభవం దృష్ట్యా ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఏదో మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకోవద్దనే ఉద్దేశ్యంతోనే బాబు మౌనంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అప్పుడు తొందరపాటు కారణంగా తెలంగాణలో పార్టీ కొద్ది రోజుల క్రితం వరకు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొందని, ఇప్పుడు మళ్లీ మాట్లాడి నష్టపోకూడదని భావిస్తున్నారని అంటున్నారు. తనను కలుస్తున్న తెలంగాణ, సీమాంధ్ర నేతలతోను బాబు మౌనంగానే ఉండమని సూచిస్తున్నారట.
కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్న ఇలాంటి పరిస్థితుల్లో తాము మాట్లాడకుంటే పార్టీ నష్టపోతుందని తెలంగాణ నేతలు బాబు వద్ద చెబితే లక్ష్మణ రేఖ దాటవద్దని చెబుతున్నారట. విభజనకు అనుకూలంగా ప్రచారం సాగుతోందని, ఇతర పార్టీల నేతలు సమైక్యం కోసం గళం విప్పుతున్నారని, తాము మాట్లాడుతామని సీమాంధ్ర నేతలు చెప్పినా మౌనంగానే ఉండమని చెబుతున్నారట.
తనను కలుస్తున్న నేతలకు ఆయన మరో విషయం కూడా చెబుతున్నారని సమాచారం. కాంగ్రెసు పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని, పంచాయతీ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఇలాంటి ప్రచారానికి తెరలేపిందని ఆయన చెబుతున్నారట. తప్పుడు సమాచారమిచ్చి, వాటిని లీక్ చేసి లబ్ధి పొందాలని చూస్తోందని, మనం మాత్రం స్పందించవద్దని ఆయన నేతలకు సూచిస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications