ప్రమోషన్: టిడిపి ఫ్లెక్సీల జాబితాలో నారా లోకేష్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో ఎట్టకేలకు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌కు ప్రమోషన్ లభించింది. తెలుగుదేశం పార్టీ తరఫున రూపొందించే ఫ్లెక్సీలు, ప్రచార ప్రకటనల్లో నారా లోకేష్ పొటోను చేర్చారు. టిడిపి అధికారి వెబ్‌సైట్‌లో ఫ్లెక్సీల కోసం ఉపయోగించాల్సిన నారా లోకేష్ ఫోటోలను చేర్చారు. మొత్తం మూడు రకాల నిలువెత్తు ఫోటోలను పార్టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించాలని సూచించారు.
టిడిపి అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయి. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా వారి ఫోటోలు కనిపించవు. పార్టీ ప్రచారం కోసం నాయకులు రూపొందించే ప్లెక్సీలు, ప్రకటనల్లో ఉపయోగించుకోవడానికి ఆరుగురి ఫోటోలను పొందు పరిచారు.

ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడు. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ ఫోటోలను పొందు పరిచారు. ఎన్టీఆర్‌వి ఏడు రకాల బొమ్మలు ఉండగా, చంద్రబాబువి 12 ఫోటులున్నాయి. పచ్చని పొలాన్ని దున్నుతున్న దున్నుతున్న బాబు, నాగిలి భుజాన వేసుకున్న ఫోటోలు వీటిలో ఉన్నాయి. ఇక బాలకృష్ణవి నాలుగు రకాల ఫోటలు ఉండగా, జూనియర్ ఎన్టీఆర్‌వి మూడు, లోకేష్‌ని నిలువెత్తు ఫోటోలు 3 ఉన్నాయి. హరికృష్ణవి కూడా 2 ఉన్నాయి.
రెండేళ్ల క్రితం గండిపేటలో జరిగిన మహానాడులో ప్లెక్సీలపై లోకేష్ ఫోటోలను ఉపయోగించడంపై హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపైబాబు స్పందిస్తూ ఒకరిద్దరు లోకేష్ ఫోటోలను ఉపయోగించడం సరికాదని సున్నితంగా మందలించారు. ఇప్పుడు ఏకంగా పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లోనే లోకేష్ ఫోటోలు ప్లెక్సీల కోసం ఎలాంటివి ఉపయోగించాలో సూచించడం విశేషం. మొత్తం మీద, నారా లోకేష్‌కు పార్టీలో అగ్రస్థానం లభించినట్లేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications