రాహుల్‌కి సోనియా నో!: ప్రధాని రేసులో ప్రియాంక?

రాహుల్ ప్రధాని పైన నిరాసక్తత ప్రదర్సిస్తున్న సమయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కూతురు ప్రియాంకను రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీ మంగళవారం నుంచి మరో సరికొత్త కార్యక్రమం మొదలుపెడుతున్నారు. రాయబరేలీ నియోజకవర్గంలో నాయకులను ఇంటింటికీ పంపుతున్నారు.
పార్టీ నేతలకు ఆరు రోజుల పాటు ముమ్మరంగా శిక్షణనిచ్చి ఇందుకు సిద్ధం చేశారు. ఇప్పుడు వీళ్లంతా 'మీ ముంగిటకు' అనే కార్యక్రమంలో భాగంగా మొత్తం నియోజకవర్గంలోని ప్రతి గడపకూ వెళ్లి ప్రజల సమస్యలేంటో తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఇదంతా ప్రియాంక సొంత ఆలోచనేనట. శిక్షణ పొందిన కార్యకర్తలందరికీ మోటార్‌సైకిళ్లు ఇచ్చి, గ్రామస్థులు చిన్న ఫోన్ చేయగానే వెంటనే వారి ముంగిటకు వెళ్లి, సమస్యలు తీర్చేలా రూపొందించారు.
ఈ నెల 15 నుంచి స్వయంగా ప్రియాంక కూడా రంగంలోకి దిగి ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు నిజంగా లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అన్న విషయం తెలుసుకోవడానికే ఈ బృందాన్ని తయారు చేశారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే, రాహుల్ గాంధీ నిరాసక్తత ప్రదర్శిస్తున్నప్పటికీ ఆయనను ఒప్పిస్తామని కాంగ్రెసు వర్గాలు మొదటి నుండి చెబుతున్నాయి. మరోవైపు రాహుల్ చరిష్మా పని చేయక పోవడం వల్లనే ప్రియాంకను సోనియా ఎంకరేజ్ చేయనున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications