జగన్ కరుణ: వైయస్ వివేకాకు ఎమ్మెల్సీ టికెట్?

కేవలం కుటుంబసభ్యుడనే కాకుండా శాసనమండలిలో పార్టీ నుంచి అనుభవజ్ఞుడు ఉండాలన్న వ్యూహంతోనే ఆయన వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో వదిన వైయస్ విజయలక్ష్మిపై ఓడిపోయిన తర్వాత కాంగ్రెసు పార్టీ వివేకానంద రెడ్డిని పట్టించుకోలేదు. దీంతో క్రమంగా ఆయన వైయస్ జగన్ వైపు వచ్చేశారు.
అంతేకాకుండా, కడప జిల్లాలో ప్రస్తుతం అనుభవం ఉన్న నాయకుడు పార్టీకి అవసరంగా మారింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మికి రాజకీయ వ్యూహాలు తెలియకపోవడం, జిల్లాలో పార్టీని ఏకతాటిపై నడిపించే స్థాయి లేకపోవడం, ఉన్న వారిలో మైసురారెడ్డికి మినహా మిగిలిన వారికి ఎక్కువ రాజకీయ అనుభవం లేకపోవడం, మైసురారెడ్డి పలుకుబడి కూడా ఒక నియోజవర్గానికే పరిమితం కావడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో మాజీ పార్లమెంటుసభ్యుడిగా అన్ని ప్రాంతాలు, నాయకులతో సత్సంబంధాలున్న వివేకానందరెడ్డికే సీటు ఇవ్వాలనియోచిస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ జైలులో ఉండటం, మేనమామ రవీంద్రనాధ్‌రెడ్డి కూడా జైలు పాలు కావడం, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు బలం పుంజుకుంటుండడం, తమ పార్టీకి జిల్లాపై దృష్టి సారించే నేత లేకపోవడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని వివేకానంద రెడ్డి చురుకైన పాత్ర పోషించేలా చూడాల్సిన అవసరం జగన్‌కు ఏర్పడిందని అంటున్నారు. దీంతో వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దింపితే పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!