మండలిలో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది'?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా టైటిల్ సర్వత్రా అదరగొడుతోంది. ఆ సినిమా పేరు యువకుల నోళ్లలోనే కాదు, పెద్దల నోళ్లలో కూడా నానుతోంది. గతంలో గవర్నర్ నరసింహన్ ఆ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తాజాగా, శాసనమండలిలో సరదా ఆ సినిమా పేరు ప్రస్తావనకు వచ్చింది.
పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది'? సినిమా పేరు మంగళవారం శాసనమండలిలో సరదాగా చర్చకు వచ్చింది. రాష్ట్ర పునర్వ్యస్థీకర బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర మంత్రి గీతారెడ్డిని ఉద్దేశించి మండలి చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి - మీ ‘అత్తారింటికి దారేది'? అంటూ ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి మాట్లాడుతుండగా, అప్పుడే సభలోకి మంత్రి గీతారెడ్డి వచ్చారు. గీతారెడ్డిని ఉద్దేశించి రాజకుమారి మాట్లాడుతూ - మా గీతక్క తల్లిగారు తెలంగాణకు చెందిన వారైనప్పటికీ, ఆమె అత్తగారు రాయలసీమకు చెందినవారన్నారు. గీతారెడ్డితో పాటు గీతారెడ్డి తల్లి ప్రముఖ సంఘసేవకురాలు ఈశ్వరీబాయి పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని రాజకుమారి అన్నారు.
గీతారెడ్డి అత్తగారిది రాయలసీమ కాబట్టి ఆమె కూడా సీమాంధ్రకు చెందిన వారేనని అన్నారు. ఈ సందర్భంగా చక్రపాణి సరదాగా గీతారెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మీ అత్తారింటికి దారేది?' అంటూ ప్రశ్నించడంతో సభలో నవ్వులు విరిశాయి.












Click it and Unblock the Notifications