చంద్రబాబు బిజెపికి కూడా పనికి రారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి రాష్ట్ర నాయకులు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ బిజెపి నాయకులు మరింతగా తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రతిఘటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైంది.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో తమ జాతీయ నాయకత్వం పొత్తుపెట్టుకుంటే ఓటమిని ఎదుర్కోవడం ఖాయమని బిజెపి శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వచ్చిన రాజ్నాథ్ సింగ్ను ఆయన గురువారం ఉదయం కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమే లేదని లక్ష్మినారాయణ అన్నారు. తమ పార్టీ నేతలు కొందరు తమ స్వార్థం కోసమే పొత్తు కావాలంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై అంతకు ముందు ఆయన నాయకత్వంలోని నేతలు రాజ్నాథ్ సింగ్కు వినతి పత్రం సమర్పించారు.
నిజానికి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. అయితే, తెలంగాణపై చంద్రబాబు వైఖరి ఆ పార్టీకి నష్టం చేసిందనే అభిప్రాయం ఉంది. దానికితోడు, తెలంగాణపై తీసుకున్న వైఖరి వల్ల తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీకి బలం పెరిగిందని, దానికి నరేంద్ర మోడీ ఇమేజ్ కూడా కలిసి వస్తుందని బిజెపి తెలంగాణ నాయకులు భావిస్తున్నట్లున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ తమ వైపు మళ్లుతుందనే అంచనా కూడా వారికి ఉన్నట్లుంది. ఏమైనా, చంద్రబాబుకు ఈ పరిస్థితి రావడం కాస్తా ఆలోచించాల్సిన విషయమే.












Click it and Unblock the Notifications