ఎవరో చెప్పారని కాదు: బాలకృష్ణకు చంద్రబాబు నో
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణను పక్కన పెడుతున్నారా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొంతకాలంగా బాలయ్యకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలని ఆయన అభిమానులు పట్టుబడుతున్నారు.
అయితే, బాలయ్యకు పదవి ఇచ్చే విషయమై చంద్రబాబు పరోక్షంగా నిరాకరించినట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని అంటున్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. రానున్న ఎన్నికల అనంతరం పార్టీలో రెండో పవర్ సెంటర్ లేకుండా ఉండేందుకు బాలయ్యను పోటీ చేయించకుండా కేవలం ప్రచారానికి మాత్రమే చంద్రబాబు ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై బాబు రెండు రోజుల క్రితం స్పందించారు.

బాలకృష్ణ ఎక్కడ నుండి పోటీ చేస్తానంటే అక్కడి నుండి టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయమై మాత్రం పరోక్షంగా నిరాకరించారని చెబుతున్నారు.
నిర్ణయాలు తీసుకోవడంలో గతానికి, ఇప్పటికి తనలో చాలా మార్పు వచ్చిందని, సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడే మంచి ఫలితాలు వచ్చాయని, ఎవరో ఏదో చెప్పారని నిర్ణయాలు తీసుకుంటే కొంప మునుగుతుందని అభిప్రాయపడ్డారు. అందులోని మర్మం బాలయ్యకు పదవి ఇవ్వవద్దనే ఉద్దేశ్యమేనని అంటున్నారు.
కాగా, రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ పోటీ చేస్తానంటే శాసనసభ లేదా లోకసభ సీటు కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారు. బాలయ్యతో పాటు అందరూ ప్రచారంలో పాల్గొనాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications