కిరణ్ వద్ద 14 ప్రేమలేఖలు, ఒకే చెప్పాలనుకుంటే..
హైదరాబాద్: శ్రీధర్ బాబు రాజీనామాతో కలిపి తన వద్ద పద్నాలుగు ప్రేమ లేఖలు ఉన్నాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. శాసన సభ వ్యవహారాల నుండి తొలగించినందుకు శ్రీధర్ బాబు నాలుగు రోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై కిరణ్ భిన్నంగా స్పందిస్తున్నారు.
రెండు రోజుల క్రితం శ్రీధర్ బాబు రాజీనామా లేఖ పైన అడిగినప్పుడు.. అదేమైనా ప్రేమలేఖనా అన్నారు. తనకు ప్రేమ లేఖ అందిందని వ్యాఖ్యానించారు. శనివారం విలేకరుల సమావేశంలోను కిరణ్ దీనిపై స్పందించారు. తన వద్ద ఎన్నో ప్రేమ లేఖలు ఉన్నాయన్నారు. శ్రీధర్ బాబు ప్రేమ లేఖ అందిందన్నారు.

ఆయన రాజీనామాను ఆమోదించారా అని విలేకరులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దానికి కిరణ్ స్పందిస్తూ... తన వద్ద ఇప్పటికే పదమూడు ప్రేమ లేఖలు ఉన్నాయని, శ్రీధర్ బాబుది పద్నాలుగోది అన్నారు. పలువురు సీమాంధ్ర మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారని, అవి తన వద్ద ఉన్నాయన్నారు. తాను వారి రాజీనామాలు ఆమోదించదల్చుకుంటే ముందు మీడియాకు చెబుతానన్నారు.
మరోవైపు శనివారం శ్రీధర్ బాబు తన సొంత కారులో అసెంబ్లీకి వచ్చారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేసినందున ఇక నుండి కార్యక్రమాలలో పాల్గొనని చెప్పారు. తన అధికారిక ఫెసిలిటీస్‌ను తిరిగి ఇచ్చేశానని చెప్పారు. వాహనాన్ని కూడా ఇచ్చానన్నారు. అనంతరం శ్రీధర్ బాబు సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కలిశారు.












Click it and Unblock the Notifications