ఎన్టీఆర్‌పై అభిమానం డొక్కాను చిక్కుల్లో పడేసింది
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను... స్వర్గీయ నందమూరి తారక రామారావుపై అభిమానం చిక్కుల్లో పడేసింది. డొక్కా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు అభిమాని. అదే సమయంలో ఆయన చిత్తశుద్ధి కలిగిన కాంగ్రెసు పార్టీ కార్యకర్త. ఇప్పుడు ఇదే ఆయనను ఇబ్బందులకు గురి చేస్తోంది.
కాంగ్రెసు పార్టీ నాయకుడు అయిన డొక్కా సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ కమిటీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహిస్తుంటారు.

గతంలో ఆయన మంత్రి హోదాలోని తన చాంబరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. గతంలో మాదరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ జయంతిని నిర్వహించారు. అయితే, టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆఱ్ జయంతిని ఎలా నిర్వహిస్తారని మాణిక్య వరప్రసాద్ పైన అధిష్టానానికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
దీనిపై డొక్కా వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చే అవకాశముంది. ఆదివారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జయంతిని డొక్కా నిర్వహించే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. హైదరాబాదులోని ఇందిరా భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. అయితే రఘువీరా దీనిపై సంజాయిషీ కోరుతారా లేదా అనేది ఈ రోజు తేలనుంది. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా దానికి ఆయన ముందు ముందు అయినా సమాధానం చెప్పే పరిస్థితి రావొచ్చునంటున్నారు.












Click it and Unblock the Notifications