బాబు దేవుడి ప్రస్తావన, జగన్‌పై పరకాల కామెంట్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం సంపాదకులకు లంచ్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఆయన చేసి ఉంటారని భావిస్తున్నారు.
సంపాదకుల సమావేశంలో చంద్రబాబు కాసేపు ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడారు. తాను ఇంటి నుండి బయలుదేరే ముందు దేవుడికి నమస్కారం పెడతానని చెప్పారు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయాలు చాలా ఉన్నాయని, సౌకర్యాలు మెరుగు పరిస్తే వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.

తిరుమల వెంకన్నకు నగదు, బంగారం కలిపి దాదాపు రూ.10వేల కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయని, ఒక 20 ఏళ్లుంటే అవి లక్ష కోట్లు అవుతాయని చెప్పారు.
దీనిపై అక్కడే ఉన్న పరకాల ప్రభాకర్ స్పందిస్తూ.. 'ఏడుకొండలవాడికే లక్ష కోట్లు సంపాదించాలంటే ఇరవై ఏళ్లు పడుతుంది.. కానీ' అంటూ చమత్కరించారు. పరకాల ఈ వ్యాఖ్య వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసి ఉంటారని భావిస్తున్నారు. జగన్ లక్ష కోట్లు సంపాదించారని టీడీపీ నిత్యం విమర్శిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications