కెసిఆర్‌తో ఢీ: పవన్ తెలంగాణకు వ్యతిరేకమా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకమా? అంటే.. ఆయన ప్రసంగం చూస్తుంటే అవుననిపిస్తోందని పలువురు తెలంగాణవాదులు అంటున్నారు. శుక్రవారం జనసేన ప్రకటన సమయంలో పవన్ చేసిన ప్రసంగం... ఆయన తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం అన్ని భావన తెలంగాణవాదుల్లో ఏర్పడిందంటున్నారు.
పవన్ తెలంగాణ వ్యతిరేకి అని, వెయ్యికి పైగా మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ గాయం, పవన్‌కు విభజన జరిగిన తీరు చూసినప్పుడు అయిందా అని తెలంగాణ మాలమహానాడు నేత అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. పలువురు తెలంగాణవాదులు పవన్ వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాన్ని టార్గెట్ చేయడం గమనార్హం. కెసిఆర్ కుటుంబాన్ని పవన్ టార్గెట్ చేయడంపై ప్రస్తుతానికి ఆ పార్టీ వర్గాలు మౌనంగా ఉన్నప్పటికీ ముందుముందు ముప్పేట దాడికి వెనుకాడరని చెబుతున్నారు.

అయితే, కెసిఆర్ కుటుంబాన్ని విమర్శించడం ద్వారా పవన్ తన ధైర్యాన్ని చాటారనే వారు కూడా లేకపోలేదు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో.... తెరాసను, కెసిఆర్ కుటుంబాన్ని ఎవరైనా విమర్శిస్తే వారిపై తెరాస.. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రవేస్తారనే ప్రచారం ఉంది.
అలాంటిది పవన్ కళ్యాణ్.. కెసిఆర్ కుటుంబాన్ని విమర్శించడం ద్వారా సవాల్ విసిరారంటున్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ ప్రధానంగా తెలంగాణ పైనే దృష్టి సారించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన కెసిఆర్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు తన సంసిద్ధతను అలా వ్యక్తపరిచారంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం సమయంలో తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా కూడా పవన్ అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు.
పవన్ తెలంగాణ వ్యతిరేకి అనడంలో ఎలాంటి అర్థం లేదనే వారు లేకపోలేదు. ఆయన కాంగ్రెసు, కెసిఆర్, ఇతర పార్టీలకు ఎన్నో ప్రశ్నలు సంధించారని, అందులో భాగంగానే కెసిఆర్ కుటుంబంపై ధ్వజమెత్తారని చెబుతున్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ కుటుంబం కోట్లు దండుకున్నారనే ఆరోపణలను కొందరు గుర్తు చేస్తున్నారు. తాను గద్దర్ ఆటలతో పాటలతో ఉత్తేజితుడనయ్యానని, తెలంగాణ సాయుధ పోరాటం గురించి తాను చదివానని పవన్ స్వయంగా చెప్పారని, బిజెపి, టిడిపిల వలె విభజన తీరును మాత్రమే ఆయన తప్పు పట్టారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications