జయప్రద వారసుడు: నితిన్ సినిమాతో ఎంట్రీ
హైదరాబాద్: అలనాటి నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద వారసుడు తమిళ సినిమా రంగంలో ఆరంగేట్రం చేస్తున్నాడు. రాజకీయాల్లో రాణించిన జయప్రద అంతకన్నా ఎక్కువగా తెలుగు, ప్రాంతీయ భాషా చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ రాణించింది. బాలీవుడ్ అందాల తారగా పేరు సంపాదించుకుంది.
ఆమె నటవారసుడిగా రాజాబాబు అనే తమ్ముడు గతంలో వచ్చాడు. అతని సినిమాలు పెద్దగా ఆడలేదు. రెండు చిత్రాలు అసలు వెలుగు చూడలేదు. ఇప్పుడు తాజాగా ఆమె సోదరి కొడుకు సిద్దార్థ్‌ను వెలుగులోకి తెచ్చింది.
అతనితో ప్రస్తుతం తమిళ సినిమాలో నటింపజేసింది. తెలుగులో నితిన్ 'ఇష్క్' సినిమాను తమిళంలో 'ఉయిరే.. ఉయిరే..'గా తెరకెక్కిస్తున్నారు.

సిద్ధార్థ్ తమిళ చిత్ర నిర్మాణంలో జయప్రద రాజకీయ గురువు అమర్‌సింగ్ కూడా భాగస్వామి అవుతున్నాడట. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ బాణీలు ఇస్తున్నాడు. కాగా, ప్రత్యేకంగా ఈ సినిమాలో జయప్రద బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తుందట. తన వారసుడ్ని ఆశీర్వదించమని అడగబోతుంది.
ఇటీవలి సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గాలికి జయప్రద ఓటమి పాలైంది. తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్రయత్నం చేసిన ఆమెకు రాష్ట్ర విభజన అడ్డు వచ్చినట్లు ఉంది. రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆమె ఇతోధికంగా ప్రయత్నించారు. కానీ ఫలితం కనిపించలేదు.












Click it and Unblock the Notifications