ఇంకా చంద్రబాబును వీడని నీడ కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకోవడం మానలేదు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో మంచి క్యాడర్ ఉన్న టిడిపీినే కెసిఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెసు పార్టీని కూడా ఆయన విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రధానంగా తెలంగాణ టిడిపియే ఆయన లక్ష్యంగా ఉంటూ వచ్చింది.
అప్పుడు తెరాసలో చేరిన వారిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వారే ఉన్నారు. ఇప్పటికీ కెసిఆర్ ప్రధాన లక్ష్యం చంద్రబాబే కావడం విశేషం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెరాస, కాంగ్రెసు పార్టీ మధ్యనే హోరాహోరీ ఉంటుందని, టిడిపి ప్రభావం ఏమాత్రం కనిపించదని అందరూ భావించారు. అయితే అంచనాలు కొంత తారుమారు అయ్యాయి. కాంగ్రెసు పార్టీతో టిడిపి ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా సత్తా చాటింది.

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మంచి కేడర్ ఉండటమేనని అందుకు కారణమని చెబుతున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో కెసిఆర్ ప్రతిపక్షాలను, మరీ ముఖ్యంగా బలమైన కేడర్ కలిగి ఎన్నికల్లో ఊహించని విధంగా సత్తా చాటిన టిడిపి లక్ష్యంగా చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. విభజనకు ముందు చంద్రబాబు సిద్దాంతం ఆ పార్టీని దెబ్బ తీసేందుకు ఉపయోగపడగా, ఇప్పుడు ఎపిలో టిడిపి అధికారంలో ఉండటంతో రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడే ప్రతి అంశానికి లేదా సమస్యకు చంద్రబాబును తెరాస ప్రభుత్వం టార్గెట్ చేసేందుకు వెసులుబాటు కలిగింది.
అంతిమంగా అది తెలంగాణలోని తెలుగుదేశం నేతలకు ఇబ్బందులు కలిగిస్తుందని తెలంగాణలో టిడిపి ఉనికికి సమస్యగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్స్, పీపీఏల రద్దు, సాగర్ నీటి విడుదల తదితర సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్య వేడి రాజేస్తున్నాయి. ఈ సమస్యలను చూపిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టిడిపి నేతలను ప్రశ్నిస్తోంది. చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తోంటే ఇంకా ఆ పార్టీలో ఎలా ఉండగల్గుతున్నారని కెసిఆర్ సూటిగా ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications