జయలలిత నో, మాసిన గడ్డాలతో సీఎం, మంత్రులు
చెన్నై/బెంగళూరు: కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తనను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఇతర నేతలతను కలిసేందుకు నిరాకరిస్తున్నారని సమాచారం. మంత్రులు సహా ఎవరినీ కలిసేందుకు ఆమె ఆసక్తి చూపించక పోవడం వల్ల జైలు అధికారులు మంత్రులను, ఇతర ముఖ్య నేతలను లోపలకు అనుమతించడం లేదని అంటున్నారు.
జయలలిత కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను కూడా కలిసేందుకు నిరాకరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రులు, ముఖ్య నేతలను కూడా కలిసేందుకు ఆమె నిరాకరిస్తున్నారని అంటున్నారు.
మరోవైపు, జయలలిత జైలుపాలవడంతో దిగులుపడుతున్న మంత్రులు మాసినగడ్డాలతో దర్శనమిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రులలో 75శాతం మాసిన గడ్డాలతోనే వస్తున్నారు. దీంతో సచివాలయంలో మునుపటి ఉత్సాహం కనిపించడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎంత ప్రయత్నించినా అధినేత్రికి బెయిల్ రాకపోవడంతో దిగాలుపడిన మంత్రులు అన్యమనస్కంగానే విధులకు హాజరవుతున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో వారిని కలిసేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు కూడా వెనుదిరుగుతున్నట్లు చెబుతున్నారు.
జయలలితకు బెయిల్ వచ్చేదాకా పరిస్థితి ఇంతేనని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న జయలలితను సొంత రాష్ట్రానికి పంపాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిఘా విభాగం ఉన్నతాధికారులతో చర్చించారని తెలుస్తోంది.
తమిళాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. హైకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ వేశారు. కానీ, ఆమె పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో జయలలిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
జయ బెయిల్ పిటిషన్‌పై 17న విచారణ
కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయలలిత తరఫున ఆమె న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైమ ఈ నెల 17న సుప్రీం కోర్టు విచారణ జరుపనుంది. బెయిలిచ్చేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించటంతో జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications