నోరు జారి: టిడిపి గెలిస్తుందన్న తెరాస నేత, సారీ
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మైనంపల్లి శనివారం మాట జారారు! తెరాసకు బదులు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతలోనే ఏం మాట్లాడానో తెలుసుకొని... మళ్లీ సరిదిద్దుకున్నారు.
విషయానికి వస్తే... మైనంపల్లి హన్మంత రావు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నేత. పొత్తులో భాగంగా మల్కాజిగిరి సెగ్మెంటును టిడిపి.. బిజెపికి ఇచ్చింది. మల్కాజిగిరి నుండి పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్న మైనంపల్లి.. టిడిపిని వీడారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చెప్పారు.

అంతలోనే కాంగ్రెసు పార్టీలో చేరారు. కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి టిక్కెట్టును మరొకరికి ఇచ్చింది. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కెసిఆర్ ఆయనకు మల్కాజిగిరి టిక్కెట్ హామీ ఇచ్చాకనే ఆయన కారు ఎక్కారు. మూడు రోజుల్లోనే మైనంపల్లి టిక్కెట్ కోసం మూడు పార్టీలు మారారు.
ఇదిలా ఉండగా... శనివారం పలువురు కార్యకర్తలు తెలంగాణ భవనంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడారు. కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తెరాస జెండా ఎగురవేస్తామని చెప్పబోయి... టిడిపి జెండా ఎగురవేస్తామని చెప్పారు. అంతలోనే సారీ అంటూ... తెరాసను గెలిపిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications