బాబు కోసం నాగం మొర, ఒప్పుకున్న టిడిపి చీఫ్
హైదరాబాద్/మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ లోకసభ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి జిల్లాలోని సభకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కూడా ఆహ్వానించాలని పార్టీ నేతలకు సూచించారట. నాగం మొదటి నుండి టిడిపిలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు.
అయితే, తెలంగాణ విషయంలో టిడిపితో విభేదిస్తూ ఆ పార్టీకి దూరమయ్యారు. కొన్నాళ్లు స్వతంత్రంగా ఉండి.. ఇటీవలె బిజెపిలో చేరారు. జిల్లాలో టిడిపికి మంచి క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ మోడీ సభకు చంద్రబాబును కూడా ఆహ్వానించాలని కోరారట.

ఆయన వినతిని బిజెపి నేతలు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకు వెళ్లారట. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారని అంటున్నారు. ఆ కారణంగానే మొదట కేవలం హైదరాబాదు సభకే చంద్రబాబు పరిమితం అవుతారనుకున్నప్పటికీ... మహబూబ్ నగర్ సభలోను ఉండనున్నారంటున్నారు. అయితే, తెలంగాణ టిడిపి నేతలు పట్టుబట్టడం వల్లనే బిజెపి నేతలు చంద్రబాబును రెండో సభకు ఆహ్వానిస్తున్నారనే వాదన కూడా ఉంది.
కాగా, నరేంద్ర మోడీ మంగళవారం తెలంగాణలో నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ సభకు చంద్రబాబు వస్తారని, మిగిలిన మూడు సభలకు రారని బిజెపి గతంలోనే ప్రకటించింది. దీంతో, నాగం రంగంలోగి దిగారని ఓ వాదన, టిటిడిపి నేతలు అడిగారని మరో వాదన ఉంది.












Click it and Unblock the Notifications