బెజవాడ నుంచి నాగార్జున భార్య అమల పోటీ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌పై బిజెపి నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో బిజెపి బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడి సాధ్యమైనంత మందిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది.
నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి, కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిజెపి కీలకంగా భావిస్తోంది. ఓ వైపు ఇప్పటికే కృష్ణంరాజు బిజెపికి గూటికి చేరారు. తాజాగా, నాగార్జున సతీమణి అమలను పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ లోకసభ స్థానం నుంచి నాగార్జున భార్య అమలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు పార్టీ తిరిగి లగడపాటి రాజగోపాల్‌ను బరిలోకి దింపుతుందా, లేదా అనేది అనుమానంగానే ఉంది. అయితే, లగడపాటి ఆ సీటును వదులుకుంటారా అనేది కూడా చెప్పలేం.
తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని నానికి ఇప్పటికే సీటు ఖరారైందని అంటున్నారు. అమలను పోటీకి దింపడం ద్వారా ఒకే వర్గానికి చెందిన నాయకుల మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications