చిరంజీవిపై పవన్ కళ్యాణ్ పైచేయి: ఫ్యాన్స్ డైలమా
బెంగళూరు/హైదరాబాద్: కర్నాటకలో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచారం ముందు.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సభలు వెలవెల పోయాయా!? అంటే అవుననే అంటున్నారు. కాంగ్రెసు పార్టీ తరఫున రెండు రోజుల (సోమవారం) క్రితం చిరంజీవి కర్నాటకలోను పలు ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించి ప్రచారం చేశారు.
ఇక ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ తరఫున కర్నాటకలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. అయితే, చిరు కంటే పవన్ ప్రచార సభకే ఎక్కువ ఆదరణ లభించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరోజు తేడాలో ఇద్దరూ కర్ణాటకలో ప్రచారం చేపట్టగా.. చిరంజీవి సభలో జనం లేక వెలవెల పోగా, పవన్ కళ్యాణ్ సభలకు ఊహించని రీతిలో జనం తరలి వచ్చారంటున్నారు.

చిరంజీవి సోమవారం కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ప్రాతినిధ్యం వహిస్తున్న చిక్కబళ్లాపురం నియోజకవర్గంలోని నాలుగు పట్టణాల్లో రోడ్డు షో నిర్వహించారు. అదే సమయంలో, మంగళవారం చిక్కబళ్లాపురానికి అనుబంధంగా ఉండే కోలార్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
గత ఏడాది ఉప ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆయనను చూసేందుకు జనం పోటెత్తారు. కొన్ని సందర్భాల్లో జనాలను అదుపు చేయలేక పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే, రెండు రోజుల క్రితం ప్రచారంలో అంత జనం కనిపించలేదంటున్నారు. అదే సమయంలో పవన్ ర్యాలీలో జనాలను అదుపు చేయలేక పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందంటున్నారు. కాగా, చిరు, పవన్‌లు వేర్వేరు పార్టీలకు ప్రచారం చేయడంతో కన్నడ మెగా అభిమానులు ఇబ్బంది పడ్డారట.












Click it and Unblock the Notifications