నోటుకు ఓటు: ఎపిలో ఎన్టీవి బ్యాన్ వెనక చంద్రబాబు?
విజయవాడ: గత శనివారం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కూడా ఎన్టీవీ న్యూస్ చానెల్ ప్రసారాలు రావడం లేదు. దీని వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నోటుకు ఓటు కేసులో టిడిపి పాత్రపై వార్తాకథనాలు ప్రసారం చేసినందుకు ఆగ్రహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలను నిలిపేసినట్లు ఆరోపిస్తున్నారు.
డిష్ టీవీ ద్వారా డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) సౌకర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఎన్టీవీ ప్రసారాలను వీక్షించగలుగుతున్నారు. అయితే, ఈ సౌకర్యం నగరాల్లోని 30 శాతం మందికి కూడా ఉండదని చెబుతున్నారు. పత్రికా స్వేచ్ఛపై టిడిపి ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రసారాలను అందించే మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్‌ఓలు) ఆ వ్యవహారంపై మౌనం వహించారు.

పత్రికా స్వేచ్ఛపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల సమాఖ్య (ఎపిజెఎఫ్) కార్యదర్శి దారా గోపీ విమర్శించారు. తెలంగాణలో టీవీ9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెళ్లపై నిషేధం విధించినప్పుడు చంద్రబాబు ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని, తనను తాను పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటనా స్వాతంత్ర్యానికి చాంపియన్‌గా చంద్రబాబు చూపించుకునే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని చంద్రబాబు బయటపెట్టుకున్నారని విమర్సించారు.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల సంఘం (జాప్) కూడా ఎన్టీవి ప్రసారాల నిలిపివేతను తప్పు పట్టింది. తెలంగాణలో న్యూస్ చానెళ్లను బ్యాన్ చేసినప్పుడు గొడవ చేసింది టిడిపి పార్లమెంటు సభ్యులేనని, ఇప్పుడు తమ పార్టీ పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటిదే జరిగితే మాట్లాడడం లేదని జాప్ అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు.
అయితే తమపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి కూడా లేదని ఎంఎస్‌ల సంఘం అధ్యక్షుడు పొట్లూరి సాయిబాబు స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల కారణంగానే ఎన్టీవీ ప్రసారాలు సరిగా రావడం లేదని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమ చానెల్ ప్రసారాల నిలిపివేతలో ప్రభుత్వ పాత్ర ఉందని తనకు ఏ విధమైన సమాచారం కూడా లేదని ఎన్టీవీ చైర్మన్ నరేన్ చౌదరి అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications