చంద్రబాబు ఔటైతే: ఆంధ్ర పన్నీర్ సెల్వం బాలకృష్ణ?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మలుపు తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తలకు చుట్టుకుంటే ఆంధ్ర పన్నీర్ సెల్వం ఆయన బావమరిది, శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణే అవుతారని ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ బుధవారంనాడు సచివాలయానికి వచ్చి మంత్రులతో సమావేశం కావడం ఆ విషయాన్ని పట్టిస్తోందని అంటున్నారు. నోటుకు ఓటు కేసు పరిణామాలపై ఆయన మంత్రులతో చర్చించారు.
అనూహ్యమైన పరిణామాలు సంభవించి ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాల్సి వస్తే ఆ స్థానంలో బాలకృష్ణ రావచ్చునని అంటున్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌కు అనుభవం లేకపోవడం, ఓటుకు నోటు కేసులో ఆయన పేరు కూడా ప్రస్తావనకు రావడం వంటి కారణాల వల్ల బాలకృష్ణకే పట్టం కట్టాలని అనుకుంటున్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

నోటుకు ఓటు కేసులో చంద్రబాబుపై బలమైన ఆధారాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ తర్వాతి రాజకీయ పరిణామాలపై టిడిపిలో సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రబాబు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఈ విషయంపై చర్చలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.
తమిళనాడులో జయలలితకు పన్నీర్ సెల్వం మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు వీర విధేయుడైన నాయకుడు కావాలని అనుకుంటున్నట్లు సమాచారం. లోకేష్ మీద చంద్రబాబు ఆలోచన సాగుతున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో బాలకృష్ణ పేరు ముందుకు వస్తోందని అంటున్నారు. బాలకృష్ణకు రాజకీయ అనుభవం అంతగా లేకపోవడం మైనస్ అవుతుందని అంటున్నారు.
నారా లోకేష్ గానీ బాలకృష్ణ గానీ కాకపోతే ప్రస్తుత శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు ఆ స్థానం దక్కవచ్చునని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, కోడెల పేరును చంద్రబాబు ఇష్టపడుతారా లేదా అనేది ఓ కోణమైతే. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్లు సహకరిస్తారా అనేది మరో కోణం. ఏమైనా, బాలకృష్ణకే ఎక్కువ అవకాశాలుంటాయనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications