చిత్రం: హరీష్ రావు జయప్రదనే గుర్తు పట్టలేదట..
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావు అలనాటి అందాల తార జయప్రదనే గుర్తు పట్టలేదట. తెలుగు చిత్రసీమను ఏలిన తార ఆమె. తన అందాలతోనే కాదు, నటననైపుణ్యంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అటువంటి నటిని హరీష్ రావు గుర్తు పట్టలేదు. మాజీ ఎంపీ కూడా అయిన జయప్రద శుక్రవారం హరీష్ రావును అధికారిక నివాసంలో కలిశారు. అయితే సాదాసీదాగా వచ్చిన ఆమెను చాలాసేపటి వరకు హరీశ్‌రావు గుర్తించనేలేదు.
కొత్త సంవత్సరం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల అధికారులు, కొంత మంది మీడియా ప్రతినిధులకు బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు 9.30 గంటల ప్రాంతంలో మామూలు వ్యక్తి మాదిరిగా జయప్రద అక్కడికి వచ్చారు. ఎవరో ఉన్నతాధికారి అయిఉండవచ్చని అక్కడున్న వారంతా అనుకున్నారు. అందరిలాగానే మంత్రి హరీశ్‌రావు కూడా అనుకున్నారు.

మంత్రి హరీశ్‌రావుకు హ్యాపీ న్యూఇయర్ అంటూ జయప్రద గ్రీటింగ్స్ తెలిపారు. ప్రతిగా హరీశ్‌కూడా శుభాకాంక్షలు తెలిపారు. కానీ, ఆమె ఎవరన్నదీ ఆయన గుర్తించలేకపోయారు. అందరి నుంచి గ్రీటింగ్స్ స్వీకరిస్తూ హరీశ్‌రావు అధికారులతో మాటల్లో పడ్డారు. ఈక్రమంలో జయప్రద అక్కడ ఓ పక్కన నిల్చుకున్నారు. దానిని గమనించిన మీడియా ప్రతినిధులు కొందరు - ఆమె జయప్రద అని మంత్రి కార్యాలయ సిబ్బందికి తెలియజేశారు.
ఆమెను కూర్చోమని చెప్పిన సిబ్బంది ఆ విషయాన్ని మాత్రం హరీశ్‌కు చెప్పలేదు. అదే క్రమంలో మంత్రి.. ఆమె ముందు నుంచే ఒకటికి రెండుసార్లు వెళ్లారు. దీంతో మీడియా ప్రతినిధులే ఆయన వద్దకు వెళ్లి.. ‘జయప్రద వస్తే పట్టించుకోవడం లేదెందుకు?' అని ప్రశ్నించడంతో.. ‘అవునా?' అంటూ ఆశ్చర్యపోయారు. ‘జయప్రద వచ్చారా? ఎవరో అధికారి అనుకున్నా.. జయప్రద అని గుర్తించలేదు' అంటూ అధికారుల వద్ద నుంచి హడావుడిగా ఆమె కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లారు. జయప్రదతో దాదాపు 15 నిమిషాలపాటు ప్రత్యేకంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications