‘బట్టలు ఉతకడం మహిళల పనే’
జకార్త: బట్టలు ఉతకడం మహిళల పనేనట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. ఇండోనేషియాకు చెందిన ఓ స్పోర్ట్స్ కంపెనీ ఉత్పత్తి చేసిన జెర్సీలపై ముద్రించిన వ్యాఖ్యలు. ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ ఇండోనేషియాకు చెందిన సాల్వో స్పోర్ట్స్ అనే క్రీడాఉత్పత్తుల సంస్థ మహిళలను కించపరిచేలా ఈ జెర్సీలను రూపొందించింది.
వివరాల్లోకి వెళితే, స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ కోసం సాల్వో స్పోర్ట్స్ కంపెనీ బట్టలు ఉతకడం మహిళల విధి అనే రీతిలో.. ‘ఈ జెర్సీని మీ మహిళకు ఇవ్వండి, అది ఆమె పని' అని షర్ట్‌లోపల ట్యాగ్‌లపై ముద్రించింది. దీనిపై సామాజిక వెబ్‌సైట్లలో మహిళల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సదరు క్రీడాఉత్పతుల సంస్థ క్షమాపణలు చెప్పింది.

‘మా సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆటగాళ్లు తమ బట్టలను సరిగా ఉతకలేకపోతే.. మహిళలకు ఇస్తే వారు వాటిని చక్కగా ఉతకగలరు అనే సందేశాన్ని ఇచ్చామే తప్ప తమకు మహిళలను కించపర్చే ఉద్దేశం లేదు' అని కంపెనీ పేర్కొంది.
బట్టలు ఉతకడం మహిళల నుంచి పురుషులు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలను ముద్రించామని తెలిపింది. అంతేగాక, బట్టలు ఉతకడంలో పురుషులకంటే మహిళలు చాలా నిపుణులని పేర్కొంది. తమ వ్యాఖ్యలు మహిళా లోకాన్ని బాధించి ఉన్నట్లయితే తాము బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని తెలిపింది.












Click it and Unblock the Notifications