ఆమె నీ భార్యకాదు, చెల్లెలు..విడాకులివ్వు:ఖాప్ తీర్పు
జింద్: హర్యానాలో షాకింగ్ సంఘటన జరిగింది. ప్రేమించుకున్న యువతీ, యువకుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఖాప్ పంచాయతీ వారి గోత్రం పేరు చెప్పి ఆమె భార్య కాదని, చెల్లెలు అని తీర్పు చెప్పింది. దీంతో, అవాక్కవడం వారి వంతయింది.
ఈ సంఘటన హర్యానాలోని జింద్ జిల్లాలో జరిగింది. పెళ్లి చేసుకున్న యువతీ, యువకుడిది ఒకటే గోత్రం కాబట్టి వారి పెళ్లి చెల్లదని ఖాప్ పంచాయతీ తీర్పు చెప్పింది. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
నర్వాన్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన పూనంను ప్రేమించాడు. వారు ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెద్దలను వారి పెళ్లికి అంగీకరించారు. కానీ, వీరిద్దరి గోత్రాలు ఒకటే అయినందున పెళ్లి చెల్లదని స్థానికులు వారించారు.

విడిపోయేందుకు ఆ జంట నిరాకరించింది. దీంతో ఖాప్ పంచాయతీ పెద్దల ముందుకు ఈ విషయం వచ్చింది. గోత్రం ప్రకారం మీరు అన్నాచెల్లెళ్లు అవుతారని, భార్యాభర్తలు కాదని, పూనంకు రూ.10 భరణం ఇచ్చి విడాకులు ఇవ్వాలని ఖాప్ పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు.
దీనికి ప్రవీణ్ కుమార్ తండ్రి సైతం అంగీకరించలేదు. దీంతో శిక్షిస్తామని వారు బెదిరించారు. ఆ జంట తమకు ప్రాణహానీ ఉందని కోర్టును ఆశ్రయించారు. హర్యానా - పంజాబ్ న్యాయస్థానం దీనిని విచారిస్తోంది. ఆ జంటకు భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది.












Click it and Unblock the Notifications