బురిడీ: మగవేషంలో శబరిమలైకి యువతి
చెన్నై: శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. కానీ ఓ యువతి మగ వేషంలో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే భద్రతాధికారులు ఆమెకు గుర్తించి వెనక్కి పంపించి వేశారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన లక్ష్మీ (18) అనే యువతి పోలీసులు కళ్లు గప్పి ఎలాగైనా స్వామి వారి దర్శనం చేసుకోవాలన్న పట్టుదలతో గురువారం రాత్రి 7 గంటలకు ప్యాంటు, షర్టు వేసుకొని బయర్దేరింది. పంబానది ప్రాంతంలో ఆమె నడిచి వెళ్తుండగా ఆలయ భద్రతాధికారులు అనుమానం రావడంతో ఆమెను అడ్డుకున్నారు.

అనంతరం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. శబరిమలై ఆలయంలోకి ప్రవేశించేందుకు గుండు గీయించుకొని మగవేషంలో వచ్చినట్లు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. దీంతో ఆమెను తిరిగి వెనక్కి పంపించేశారు. భారత సనాతన సంప్రదాయాలను ఎంతో నియమనిష్ఠలతో పాటించే శబరిమలై ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేని విషయం తెలిసిందే.
అయితే ఈ సంప్రదాయాన్ని మార్చాలని కోరూత కేరళ న్యాయవాదుల సంఘం హైకోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉంది. మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఈ అంశంపై ముందుగా ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించడంపై ప్రజాభిప్రాయ సేకరణ (ఒపీనియన్ పోల్) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో సుప్రీం కోర్టు స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆలయానికి వెళ్లేందుకు ఇదే విధంగా ప్రయత్నిస్తున్న మహిళలను గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు.












Click it and Unblock the Notifications