ప్రపంచంలో మొట్టమొదటిసారి.. కుక్కకు హోమ్ టౌన్ హీరో అవార్డు
శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రపంచంలో ఎక్కడా.. ఏ జంతువుకు ఇలాంటి అవార్డు ఇచ్చి ఉండరు. తొలిసారిగా ఈ ఘనతను దక్కించుకుంది 11ఏళ్ల జాక్సన్ అనే ఈ కుక్క. తన ఇంటి యజమానిని కుటుంబాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించినందుకు గాను హోంటౌన్ హీరో అవార్డు దక్కించుకుంది సదరు శునకరాజం.
అమెరికాలోని టాట్ లోవీ అనే వ్యక్తి ఇంట్లో.. ఎలక్ట్రిక్ షాట్ సర్క్యూట్ వల్ల ఇటీవల అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇంటి యజమానిని, అతని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయడానికి జాక్సన్ పెద్ద ఎత్తున అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపు కూడా మునుపెన్నడూ అరవని రీతిలో విచిత్రంగా ఉండడంతో.. అరుపులను గమనించి బయటకొచ్చిన యజమానికి జరగబోయే ప్రమాదం అర్థమైంది. వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి ప్రమాదం నుంచి బయటపడగలిగాడు.

తమ కుటుంబం మొత్తాన్ని ప్రమాదం నుంచి రక్షించినందుకు గాను సదరు కుక్కను హోంటౌన్ హీరో అవార్డుతో సత్కరించారు. ఇలాంటి అవార్డు ఓ జంతువుకు దక్కడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారం నాడు ఇదాహోలో జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో మెరిడియన్ సిటీ మేయర్ చేతుల మీదుగా కుక్కకు హోంటౌన్ హీరో అవార్డు అందజేశారు. కాగా, కుక్క యజమాని ఇంట్లో గత అగస్టు 29న ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇక తమను కుటుంబం మొత్తాన్ని ప్రాణాలతో బయటపడేలా చేసిన కుక్కకు జీవితాంతం రుణపడి ఉంటామంటోంది టాట్ లోవి కుటుంబం.












Click it and Unblock the Notifications