ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్లద్దాల మాయ
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన కళ్లజోడును పోగొట్టుకున్నారు. వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా ఆయన అభివృద్ధిపై సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. మంగళవారంనాడు ఆయన కళ్లద్దాలు మాయమయ్యాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు హైరానా పడ్డారు.
అయితే, బుధవారంనాడు కెసిఆర్ కళ్లద్దాలు దొరికాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం రాత్రి నక్కలగుట్టలోని నందనా గార్డెన్స్‌లో కెసిఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆ తర్వాత కెసిఆర్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లారు.
అక్కడ కెసిఆర్‌కు తన కళ్లద్దాలు గుర్తొచ్చాయి. వాటి గురించి ఆరా తీశారు. దాంతో బద్రతా సిబ్బంది, అధికారులు నందనా గార్డెన్స్‌కు వెళ్లి గాలించారు. చెత్త డబ్బాలను కూడా వారు వదిలిపెట్టలేదు. రాత్రి పదకొండున్నర వరకు వారు గాలించారు.

అయితే, మామూలుగా సీట్లోంచి ముఖ్యమంత్రి లేవగానే అక్కడున్న నాప్‌కిన్‌లను, ఇతర వస్తువులను సెక్యూరిటీ సిబ్బంది లేదా అటెండర్ తీసుకుని వెళ్తారు. వాటినన్నింటినీ తీసుకుని వెళ్లిన సిబ్బంది కళ్లద్దాలను ఎలా వదిలేశారనే ప్రశ్న తలెత్తుతోంది.
మొత్తంగా మంగళవారం మాయమైన కెసిఆర్ కళ్లజోడు బుధవారం సాయంత్రం దొరికినట్లు చెబుతున్నారు. అయితే ఎక్కడ దొరికిందనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు.












Click it and Unblock the Notifications