నేనే బొక్కలు విరిసి కుప్ప పెడతా: మహిళా ఎమ్మెల్యే
కరీంనగర్: ఓ మహిళా ఎమ్మెల్యే ప్రతిపక్షాల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలోనే ఆమె విపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శాభ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం మిషన్ కాకతీయ రెండో దశ కింద చొప్పదండిలో కుడి చెరువు పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవానికి మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొడిగె శోభ విపక్షాల పైన విరుచుకు పడ్డారు.
కుడి చెరువును మినీ ట్యాంకుబండుగా అభివృద్ధి చేయాలంటూ కాంగ్రెస్, బిజెపి నాయకులతో పాటు చొప్పదండి గ్రామస్తులు ప్లకార్డులతో సభా వేదిక వద్దకు వచ్చారు. మంత్రి ఈటెలకు వినతిపత్రం అందించి కుడి చెరువు కాలువ పరిస్థితి వివరించేందుకు వచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే శోభ జోక్యం చేసుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ... బెదిరిస్తే పోయేవాళ్లం కాదని, ప్లకార్డులు పట్టుకొని వస్తే మేం అంత సోయిలేని వాళ్లం కాదని, తమ ప్రభుత్వం ఎంత పని చేస్తుందో ప్రజలకు తెలుసునని, ఇంకోసారి మేం చేసే కార్యక్రమానికి వస్తే బాగుండదని విపక్షాలను హెచ్చరించారు.
మా పోలీసులు ఏం చేయడం లేదని, ఎందుకంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నాం కాబట్టి మా సీఐ గారు, మా డీఎస్పీ గారు, మా ఎస్సైలు అంతా నిలబడి చూస్తున్నారని, కానీ నేనే బొక్కలు విరిసి కుప్ప పెడతానని ఆమె వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఇక ఊరుకునే సమస్యే లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications