ప్యాంట్లు వేసుకోవద్దు: ముస్లిం మహిళలకు కఠిన నిబంధన
న్యూఢిల్లీ: భర్త అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటికే రావొద్దని బ్రిటన్‌లోని ముస్లిం మహిళలకు మసీదులు జారీ చేసిన నిబంధన ఇది. 'ద టైమ్స్' పరిశోధన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతేకాదు 'మహిళలెవరూ ఫేస్‌బుక్ అకౌంట్లు తెరవద్దు, ఒకవేళ ఇప్పటికే ఉంటే డిలీట్ చేసేయండి. ప్యాంట్లు వేసుకోవద్దు. అసలు భర్త అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటకే రావద్దు.' లాంటి కఠిన నిబంధనలు విధించాయి.
బ్రిటన్‌లోని ముస్లిం సంఘాలు, మసీదులు ప్రచురించిన నిబంధనలను 'ద టైమ్స్' ఓ నివేదికలో ప్రస్తావించింది. లండన్‌లోని ఇస్లామిక్ సెంటర్, క్రోయ్‌డాన్ మసీదు, సెంట్రల్ మసీదు ఆఫ్ బ్లాక్ బర్న్ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ఆ దేశంలోని భర్త అనుమతి లేకుండా ఇంటి నుంచి భార్య బయటకు రావడం ప్రమాదకరమట.
అంతేకాదు భర్త అనుమతి లేకుండా ఏ పనీ చేయొద్దని సూచించింది. కాగా సెంట్రల్ మసీదు ఆఫ్ బ్లాక్‌బర్న్ 'డేంజర్స్ ఆఫ్ ఫేస్‌బుక్' తన వెబ్ పోస్టులో మద్యపానం పాపం అనే ఖురాన్ సూక్తిని ప్రస్తావిస్తూ.. ఇది సామాజిక మాధ్యమాలకూ వర్తిస్తుందని వివరించింది.

ఫేస్‌బుక్ అనేది పాపానికి ద్వారాలు తెరుస్తుందనీ, దీని ద్వారా ముస్లిం మహిళలు బలవుతున్నారని సూచించింది. ఇదిలా ఉంటే ముస్లిం మహిళలు బయటే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు భర్త ముందు కూడా మహిళలు ప్యాంటు వేసుకోవద్దనే నిబంధనను బర్మింగ్‌హామ్‌లోని గ్రీన్ లేన్ మసీదు నిబంధన విధించింది.
ముస్లిం మతపెద్దలు, ముస్లిం సంఘాలు జారీ చేసిన నిబంధనలపై ముస్లిం మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి కాలం చెల్లిన నిబంధనలను తమపై ఇంకా రుద్దవద్దని ఇస్లామిక్ షరియా కౌన్సిల్ నాయకురాలు ఖోలా హసన్ పేర్కొన్నారు. ఇవి పితృస్వామ్య వ్యవస్థ, సంకుచిత దృష్టికి అద్దం పడుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications