పవన్ కళ్యాణ్ టీవీ ఛానల్ పెట్టనున్నారా? అందుకే: డబ్బుల మాటేమిటి
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఛానల్ పెట్టనున్నారా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ మీడియాతో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తద్వారా పూర్తి సమయం రాజకీయాలకు అంకితం కానున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు.
ఇదిలా ఉంచితే, రాజకీయ పార్టీలకు పబ్లిసిటీ కచ్చితంగా కావాలి. టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్ల ద్వారా నాయకులకు పబ్లిసిటీ వస్తుంది. ప్రముఖుల విషయంలో ఏం జరిగినా మీడియా హైలెట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ టాప్ హీరో. కాబట్టి ఆయన విషయంలోను మీడియా ఎప్పుడు బాగా స్పందిస్తున్న విషయం తెలిసిందే.

అదే సమయంలో, పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టినందున వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుంది, ఒంటరిగా పోటీ చేస్తారా అనే విషయం స్పష్టం కాలేదు. ఒంటరిగా పోటీ చేస్తే వ్యతిరేక పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియాతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలను కొట్టిపారేయలేం.
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతి పార్టీకి మీడియా ఉండటం లేదా మీడియా మద్దతు బాగా ఉండటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగితే.. వ్యతిరేక పార్టీకి చెందిన మీడియా ఆయనను టార్గెట్‌గా చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇప్పుడు పొగుడుతున్న వారే అప్పుడు తిట్టవచ్చు. ఇది జనసేనకు నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు సొంత మీడియా ఉంటే బాగుండేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పవన్ కూడా కొత్త టీవీ ఛానల్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఓ టీవీ ఛానల్ పెట్టడం లేదా ఓ న్యూస్ పేపర్ పెట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పార్టీ నడిపేందుకే డబ్బులు లేవని పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన తొలుత యూట్యూబ్ ఛానల్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఓ ఛానల్ కూడా కొంటారని తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీ నడిపేందుకు డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త టీవీ ఛానల్ కొంటారనే విషయం ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఇంట్లో పని వాళ్లకు జీతాలు ఇచ్చేందుకు, పార్టీ నడిపేందుకు డబ్బుల్లేవని పవన్ చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications