టీటీడీపీకి ఊపు తెచ్చే పనిలో రేవంత్ : కొత్త నినాదం పార్టీకి ఊపిరి పోస్తుందా..!
మెదక్ : అధికార పార్టీతో తోక పార్టీ ముద్ర వేయించుకుని ఇప్పటికే ఉనికిని కోల్పోయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని చూస్తున్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో టీడీపీ పరిస్థితి మారడమేమో గానీ, పదునైన వ్యాఖ్యలతో తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్.
పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు.. జిల్లాల పర్యటనను ముందేసుకున్న రేవంత్ రెడ్డి తాజాగా మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రేవంత్, అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజల మధ్యన విబేధాలు సృష్టించేందుకే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
10-15 మండలాలు, రెండు మూడు నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వెనుక కేసీఆర్ కుటుంబానికి లాభించే రాజకీయాల ప్రయోజనాలున్నాయన్నారు. కూతురు కవితకి, కొడుకు కేటీఆర్ కి, మేనల్లుడు హరీశ్ ల రాజకీయ సౌలభ్యం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. ఎక్కడా అభివృద్ధి జరిగింది లేదని విమర్శించారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయినవారికి మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వాల్సిన నష్ట పరిహారాన్ని ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ఫాంహౌస్ భూములను దళితులకు పంచాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ఫాంహౌస్ లో మంచినీటి పైపులు కూడా వేయించామని గొప్పలు పోతున్న టీఆర్ఎస్ నాయకులు, ఫాంహౌస్ లో ఉన్న రెండు బావుల్లో నీటిని పూర్తి స్థాయిలో నింపుకునేందుకే పైప్ లైన్ వేయించారన్న విషయం బహిరంగపర్చాలన్నారు.
మెదక్ జిల్లాలో టీడీపీకి గత వైభవాన్ని తీసుకొస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి, ఇందుకోసం పార్టీ సమస్యలైనా, ప్రజా సమస్యలైనా, తన తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఓ కొత్త నినాదాన్ని కూడా ఇచ్చారు రేవంత్. 'తెలంగాణ మట్టి మనదిరా... తెలుగుదేశం పార్టీ మనదిరా..' అన్న నినాదంతో ఇప్పటినుంచి పార్టీ కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెదక్ వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు అశోక్ గౌడ్ తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.












Click it and Unblock the Notifications